ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

  • ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం
  • రాష్ట్రంలో రూ.34 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం
  • సుమారు 35 వేల ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్
  • ఉండవల్లి, జ్యుడీషియల్ అకాడమీకి భారీగా నిధులు కేటాయింపు
ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర వేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు ఇతర వివరాలను హోంమంత్రి వంగలపూడి అనిత తన 'ఎక్స్‌' ఖాతా ద్వారా వెల్లడించారు. ఉద్యోగుల వయసు పెంపుతో పాటు పలు ఇతర కీలక ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి రూ.34 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రతిపాదనకు, తద్వారా 35 వేల ఉద్యోగాలను సృష్టించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

అంతేగాక‌ ఉండవల్లిలో మౌలిక వసతుల కల్పనకు రూ.426 కోట్లు, జ్యుడీషియల్ అకాడమీ నిర్మాణానికి రూ.130 కోట్లు కేటాయించారు. మొత్తం మీద దాదాపు 80కి పైగా అజెండా అంశాలను మంత్రివర్గం ఆమోదించినట్లు హోంమంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Andhra Pradesh Cabinet
Retirement age hike
Chandrababu Naidu
AP Government employees
AP PSU retirement age
Andhra Pradesh investments

More Telugu News